గ్రీన్‌ కెరీర్‌కి క్లీన్‌ ఎనర్జీ.. భవిష్యత్తులో 15 లక్షల కొలువులు..!

0
126


గ్రీన్‌ కెరీర్‌కి క్లీన్‌ ఎనర్జీ.. భవిష్యత్తులో 15 లక్షల కొలువులు..!

జాబ్‌ మార్కెట్‌లో.. ఉద్యోగార్థులకు సరికొత్త ఉపాధి వేదిక! డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు.. సరితూగే ఉద్యోగం! భవిష్యత్తులో అయిదింతలు అభివృద్ధి చెందనున్న సెక్టార్‌!

ఫలితంగా.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలకు కేరాఫ్‌గా నిలవనున్న విభాగం! అదే.. క్లీన్‌ ఎనర్జీ సెక్టార్‌!! క్లీన్‌ ఎనర్జీ రంగం ఏటేటా పురోగమన బాటలో పయనిస్తూ.. ఉద్యోగ కల్పనలోనూ ముందంజలో నిలుస్తోంది. పలు సంస్థల అంచనాలు, సర్వే గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. క్లీన్‌ ఎనర్జీ రంగంలో లభించే కొలువులు.. అవసరమైన అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం..

క్లీన్‌ ఎనర్జీ అంటే.. పర్యావరణ కాలుష్యానికి తావు లేకుండా.. కర్బన ఉద్గారాలు ఏర్పడే అవకాశం లేని విధంగా.. ఇంధన,శక్తి వనరులను ఉత్పత్తి చేసే ప్రక్రియ! రెన్యువబుల్‌ ఎనర్జీ(పునరుత్పాదక శక్తి)లో భాగమేlక్లీన్‌ ఎనర్జీ. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ప్రభుత్వాలు పర్యావరణహిత ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగంపై దృష్టిపెడుతున్నాయి. ఇంధన, శక్తి వనరుల ఉత్పత్తి, వాటికి సంబంధించి అవసరమైన మౌలిక వనరులను కూడా కాలుష్య రహితంగా రూపొందించాలని భావిస్తున్నాయి. క్లీన్‌ ఎనర్జీ విధానాల ద్వారా ఇంధన, శక్తి వనరులు ఉత్పత్తి చేసే సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తూ.. పర్యావరణాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా క్లీన్‌ ఎనర్జీ రంగం ఏటేటా విస్తరిస్తోంది. పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధన ఉత్పత్తులు మరెంతోకాలం మానవ అవసరాలకు సరిపోయే పరిస్థితి లేదు. దాంతో భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలతోపాటు పెద్ద పెద్ద కంపెనీలు సైతం క్లీన్‌ ఎనర్జీ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దాంతో ఈ రంగంలో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. భవిష్యత్‌లో భారీగా ఉద్యోగాల సృష్టి జరుగనుందని అంచనా.

సోలార్, విండ్, హైడ్రో..

క్లీన్‌ ఎనర్జీలో ముందు వరుసలో నిలుస్తున్న విభాగాలు.. సోలార్‌ పవర్‌ జనరేషన్, విండ్‌ పవర్‌ జనరేషన్, హైడ్రో పవర్‌ జనరేషన్‌. ఇటీవల కాలంలో రవాణా రంగంలో విస్తృతంగా వినిపిస్తున్న ఎలక్ట్రిక్‌ వెహికిల్స్, గ్రీన్‌ వెహికిల్స్‌ ఉత్పత్తి సంస్థలు కూడా క్లీన్‌ ఎనర్జీ కోవకు చెందినవే. మొత్తంగా కర్బన ఉద్గారాలు, కాలుష్య కారకాలు సున్నా శాతంగా ఉండేలా ఉత్పత్తులు తయారు చేసే వాటిని.. క్లీన్‌ ఎనర్జీ విభాగాలుగా చెప్పొచ్చు.

15 లక్షల కొలువులు..


  • క్లీన్‌ ఎనర్జీ కార్యకలాపాలు విస్తృతం అవుతున్న తరుణంలో ఈ విభాగంలో లక్షల సంఖ్యలో కొలువులు అందుబాటులోకి రానున్నాయని పలు సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

  • తాజాగా.. ఫిక్కీ, ఈ అండ్‌ వై నివేదిక ప్రకారం–కొవిడ్‌ అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ రికవరీకి,నూతన ఉద్యోగాల కల్పనకు క్లీన్‌ ఎనర్జీ సంస్థలు కీలకంగా నిలవనున్నాయి. ఈ సంస్థల ద్వారా 15లక్షల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

  • ఎన్‌ఆర్‌డీసీ–సీఈఈడబ్ల్యూ ఏడాది క్రితం విడుదల చేసిన గణాంకాల ప్రకారం– 2022 చివరి నాటికి సౌర, పవన, విద్యుత్‌ విభాగాల్లోనే తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికగా పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

  • గత ఏడాది చివరి(2020)నాటికిS అంతకుముందు నాలుగేళ్లతో పోల్చితే క్లీన్‌ ఎనర్జీ విభాగంలో భారత్‌లో అయిందితల వృద్ధి నమోదైంది. దీనికి అనుగుణంగా ఆ సమయంలో మూడు లక్షల ఉద్యోగాలు లభించాయి.

క్లీన్‌టెక్ ఎక్ఛేంజ్‌ మిషన్‌..

మన దేశం.. క్లీన్‌ ఎనర్జీ ఇన్నోవేషన్‌లో భాగంగా అంతర్జాతీయంగానూ ఒప్పందాలు చేసుకుంటోంది. గత నెలలో ఇన్నోవేషన్‌ క్లీన్‌ టెక్‌ ఎక్స్ఛేంజ్‌ మిషన్‌ పేరుతో అంతర్జాతీయ విధానాన్ని ఆవిష్కరించింది. ఈ మిషన్‌లో భాగంగా భారత్‌ సహా 23 దేశాలు కలిసి సంయుక్తంగా క్లీన్‌ ఎనర్జీకి సంబంధించి రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. దీంతో ఈ విభాగంలో విదేశీ అవకాశాలు కూడా లభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. క్లీన్‌ ఎనర్జీ వనరులను గుర్తించేందుకు పరిశోధనలు కొనసాగించడం, నూతన ఆవిష్కరణలు చేయడం క్లీన్‌టెక్‌ మిషన్‌ లక్ష్యంగా ఉంది. ఫలితంగా ఈ మిషన్‌ ద్వారా ప్రధానంగా డిజైన్, డెవలప్‌మెంట్‌ విభాగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

డిప్లొమా టు పీహెచ్‌డీ..

క్లీన్‌ ఎనర్జీ సంస్థల్లో విధులు నిర్వర్తించేందుకు పలు స్థాయిల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు.. అర్హతలకు తగిన కొలువులు ఖాయం చేసుకునే వీలుంది. సైన్స్, ఇంజనీరింగ్‌కు సంబంధించి పలు విభాగాల్లో స్పెషలైజేషన్లు చేసిన వారు క్లీన్‌ ఎనర్జీ రంగంలోని సోలార్, విండ్, బయోమాస్, హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌లలో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు.

జాబ్‌ ప్రొఫైల్స్‌..

ప్రస్తుతం క్లీన్‌ ఎనర్జీ విభాగంలో.. బయాలజిస్ట్స్, ఎకాలజిస్ట్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీర్స్, స్ట్రక్చరల్‌ ఇంజనీర్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్స్‌ వంటి జాబ్‌ ప్రొఫైల్స్‌ లభిస్తున్నాయి. వీరు నిర్దిష్టంగా ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, పర్యవేక్షణ, కార్యక్షేత్రంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ విధులు నిర్వర్తించడం వంటివి చేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో ప్లాంట్‌ సూపర్‌ వైజర్స్, ప్యానెల్‌ టెక్నీషియన్స్, టెక్నీషియన్స్‌ వంటి కొలువులు లభిస్తున్నాయి. ఇంజనీర్స్‌ తదితర ఉద్యోగాలకు బీటెక్‌ లేదా ఎంటెక్‌ను కనీస అర్హతగా నిర్దేశిస్తున్నారు. సూపర్‌ వైజర్స్, ప్లాంట్‌ టెక్నీషియన్‌ వంటి ఉద్యోగాలకు డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసిన వారిని సంస్థలు నియమించుకుంటున్నాయి.

ట్రెడిషనల్‌ గ్రాడ్యుయేట్లకు కూడా..

క్లీన్‌ ఎనర్జీ రంగ సంస్థలు గతంలో టెక్నికల్, సైన్స్‌ గ్రాడ్యుయేట్లకే ప్రాధాన్యం ఇచ్చేవి. ప్రస్తుతం సంస్థల కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఆయా కంపెనీల్లో అడ్మినిస్ట్రేషన్, క్లయింట్‌ రిలేషన్, అకౌంట్స్‌ వంటి కొలువులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. కమ్యూనికేషన్‌ ఆఫీసర్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్, ఫైనాన్స్‌ ఆఫీసర్స్‌ వంటి హోదాలు లభిస్తున్నాయి.

బిగ్‌ డేటా కొలువులు..

ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌లో కీలకమైన బిగ్‌ డేటా, డేటా అనలిటిక్స్‌కు సంబంధించిన కొలువులు కూడా క్లీన్‌ ఎనర్జీ సెక్టార్‌ సంస్థల్లో లభిస్తున్నాయి. సంస్థల విధానాలు, నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటూ.. డేటా విశ్లేషణ చేయడం వంటి కార్యకలాపాలను డేటా అనలిస్ట్‌లు నిర్వహించాల్సి ఉంటోంది. ఆయా వనరులకు సంబంధించిన డేటాను సమీకరించి, దాన్ని క్రోడీకరించి సంస్థ కార్యకలాపాలు సమర్థంగా సాగేలా వీరు నిరంతరం పని చేయాల్సి ఉంటుంది.

ఇంకా చ‌ద‌వండి : part 2: క్లీన్‌ ఎనర్జీ రంగంలో.. ఎంట్రీ లెవల్‌ రూ.40వేల ప్రారంభ వేతనంతో..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here